ANDHRAJYOTHY
ఎడిటోరియల్

ఏది భారతీయత? ఎక్కడ జాతీయత?

Jun 30 2020 @ 00:18AM

పీవీ, వాజపేయి మాదిరిగా ఇవాళ ప్రతిపక్షాల్లో దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావించే నేతలెవరైనా ఉన్నారా? మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విపక్షనేతలు  విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతూ సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. లద్ధాఖ్‌లో చైనా సైనికులతో పోరాడి అమరులయిన ఇరవై మంది భారత సైనికుల త్యాగాలకు విలువ ఇవ్వకుండా విపక్ష నేతలు చేస్తున్న కుత్సితమైన ప్రచారంతో భారతీయ విలువలు, జాతీయ వాదం పట్ల వారికి ఏమాత్రం గౌరవం లేదన్న విషయం స్పష్టమవుతోంది.


భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో భారతీయత, జాతీయతను గౌరవించిన కాంగ్రెస్ నేతలు లేకపోలేదు. కానీ వారిలో చాలా మంది ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఆఖరుకు అంబేడ్కర్ లాంటి నేతల్ని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకోలేకపోయింది. జాతీయ వాదాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను పరిరక్షించేందుకు నిజాయితీతో కృషి చేసిన వారందర్నీ భారతీయ జనతా పార్టీ అభిమానించింది. అధికారంలోకి రాగానే తిరంగా యాత్రలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ విస్మరించిన అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, కొమురం భీమ్, చాకలి ఐలమ్మ వంటి నేతల్ని సంస్మరించింది. సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌కు నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించింది. అంబేడ్కర్ జన్మస్థలంతో సహా ఆయనతో అనుబంధం ఉన్న అయిదు ప్రాంతాలను అభివృద్ధి పరిచింది. ప్రధానమంత్రి మోదీ తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఢిల్లీలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు స్మారక చిహ్నాన్ని నిర్మించమని ఆదేశించారు. అంతకుముందు సోనియా కాంగ్రెస్ నేతలు పీవీ గుర్తును ఢిల్లీలో లేకుండా చేసేందుకు ఆయన భౌతిక కాయాన్ని సైతం హైదరాబాద్ పంపించారు. ఎఐసిసి కార్యాలయంలోకి ఆయన భౌతిక కాయాన్ని తీసుకురానివ్వకుండా చేశారు. నెహ్రూ కుటుంబ వారసులకు తప్ప మరెవరికీ ఢిల్లీలో చోటు లేకుండా చేసేందుకు స్మారకచిహ్నాలేవీ ఇకమీదట నిర్మించకూడదంటూ శాసనం చేశారు. పీవీ ఏం పాపం చేశారు? ఒక స్వాతంత్ర్య సమరయోధుడుగా ఈ దేశ విలువలను అర్థం చేసుకుని విప్లవాత్మకమైన సంస్కరణలను భారతీయ దృక్పథంతో, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాలని నిర్ణయించడం ఆయన చేసిన పాపమా? గాంధీ పేరు చెప్పుకుంటున్న వారి కుటుంబ పాలనకు భిన్నంగా సమర్థ పాలనను అందించి అయిదు సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని స్థిరంగా నిర్వహించగలగడమే పీవీ నేరమా? అస్తవ్యస్త నిర్ణయాల ద్వారా రగిలిపోతున్న కశ్మీర్, పంజాబ్ వంటి సమస్యలను ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం పాపమా? ప్రపంచ దేశాలతో సంబంధాలను పునరుద్ధరించి, ‘లుక్ ఈస్ట్’ వంటి విధానాలను అవలంబించి దేశ అంతర్జాతీయ ప్రతిష్ఠ, అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం పీవీ చేసిన పాపమా? అందుకే ఆయనకు కాంగ్రెస్ చరిత్రలో స్థానం లేకుండా చేశారా?


పీవీ చేసిన మరో మహత్తరమైన పని దేశప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోవడం. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఇస్లామిక్ దేశాల సంస్థ మద్దతుతో 1994 ఫిబ్రవరి 27న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాక్ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయేలా చేసేందుకు ఆయన ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయిని పంపారు. వాజపేయి దౌత్యనీతి వల్ల ఇస్లామిక్ దేశాల మధ్యే విభేదాలు తలెత్తాయి. ఇరాన్, సిరియా, ఇండోనేషియా, లిబియా తో పాటు చైనా కూడా వెనక్కు తగ్గడంతో గత్యంతరం లేక పాకిస్థాన్ అదే రోజు సాయంత్రానికి తీర్మానాన్ని ఉపసంహరించుకున్నది. ఈ రకంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలన్న పాక్ కుట్రను పీవీ, వాజపేయి కలిసి భగ్నం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్ సమైక్య స్వరం వినిపించిన అపురూప ఘట్టమది. అంతకు ముందే 1994 ఫిబ్రవరి 22న పాకిస్థాన్ తీర్మానాన్ని ఖండిస్తూ కశ్మీర్ అంతర్భాగమని, అక్రమిత కశ్మీర్ ను పాకిస్థాన్ వెంటనే ఖాళీ చేయాలని భారత పార్లమెంట్ ద్వారా పీవీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. కశ్మీర్ పై పాకిస్థాన్ తోకముడిచిన సమయంలో జెనీవాలో వాజపేయి, భారత డిప్యూటీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పరస్పరం అభినందించుకుంటూ కౌగలించుకున్న దృశ్యాన్ని ఒక పత్రిక కవర్ పేజీపై ప్రచురించారు. దీనితో బిజెపితో సల్మాన్ ఖుర్షీద్ కుమ్మక్కయ్యారని దుష్ప్రచారం చేసి తర్వాతి ఎన్నికల్లో ఆయనను కాంగ్రెస్ నేతలు ఓడించారు. కాంగ్రెస్ నేతల సంకుచిత మనస్తత్వానికి, దుష్ట సంస్కృతికి నిదర్శనమిది. 


కశ్మీర్ తీర్మానం వీగిపోయేందుకు మీరు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమావేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వెళ్లేందుకు ఎందుకు అంగీకరించారని సీనియర్ జర్నలిస్టు కంచన్ గుప్తా అటల్ బిహారీ వాజపేయిని ప్రశ్నించారు. ‘మన దేశంలో మేము పాండవుల్లా అయిదుగురం, వారు కౌరవుల్లా వందమంది కావచ్చు. కాని ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం మేము 105 మందిమి. అందుకే విదేశాల్లో మన ప్రతిష్ఠ కాపాడేందుకు కలిసికట్టుగా మన స్వరం వినిపించాల్సిన అవసరం ఉన్నది..’ అని వాజపేయి జవాబిచ్చారు. ఇది బిజెపి జాతీయవాద దృక్పథం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమని వాజపేయి, పీవీ లాంటి రాజనీతిజ్ఞులు భావించేవారు. అందుకే వాజపేయి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పీవీ తాను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయిందంటూ రహస్యంగా ఒక చీటీ అందించారు. దీనితో వాజపేయి 1998 మే 11, 13 తేదీల్లో పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించారు. దీనితో ప్రపంచ దేశాల్లో భారత్ అణు శక్తిగా ఆవిర్భవించింది.


పీవీ, వాజపేయి మాదరిగా ఇవాళ ప్రతిపక్షాల్లో దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావించే నేతలెవరైనా ఉన్నారా? మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వారు విచ్ఛిన్నకరమైన కార్యకలాపాలకు పాల్పడుతూ సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తూ సర్కార్‌పై దుష్ప్రచారం సాగిస్తూ వస్తున్నారు. లద్ధాఖ్‌లో చైనా సైనికులతో భారత సైనికులు ఘర్షించి 20 మంది అమరులయ్యారు. ఆ అమరుల త్యాగాలకు విలువ ఇవ్వకుండా విపక్ష నేతలు చేస్తున్న కుత్సితమైన ప్రచారంతో భారతీయ విలువల పట్ల కానీ, జాతీయ వాదం పట్ల కానీ వారికి ఏమాత్రం గౌరవం లేదన్న విషయం స్పష్టం అవుతోంది. ఐకమత్యం ప్రదర్శించాల్సింది బదులు చైనాకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఇందుకు ప్రధాన కారణం సోనియాగాంధీ కుటుంబ సంస్థ అయిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు విరాళంగా స్వీకరించడమే. చైనా మిలటరీ కమిషన్ రాజకీయ విభాగమైన ‘చైనా అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషన్లీ ఫ్రెండ్లీ కాంట్రాక్ట్’ అనే సంస్థ నుంచి రాజీవ్ గాంధీ పౌండేషన్ విరాళాలు స్వీకరించిన విషయాన్ని బిజెపి నేతలు బయటపెట్టడంతో ఇరుకునపడ్డ కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై తమ దుష్ప్రచారం తీవ్రతరం చేశారు. కొన్ని వ్యాపార సంస్థలు ఇచ్చే విరాళాలకూ, చైనా ప్రభుత్వం నుంచి స్వీకరించే విరాళాలకూ తేడా వారికి తెలియదా? అయినా రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను అంటే కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ఒక కుటుంబానికి ఊడిగం చేస్తూ దేశ జాతీయ ప్రయోజనాలను తాకట్టుపెడుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏదీ లేదు. ఇవాళ వారు చేస్తున్న దేశ వ్యతిరేక ప్రకటనలు, ప్రచారం చేస్తున్న దేశ వ్యతిరేక భావజాలం చూస్తుంటే ఆ పార్టీ కి సోనియా కాంగ్రెస్ లేదా దేశ వ్యతిరేక కాంగ్రెస్ (యాంటీ నేషనల్ కాంగ్రెస్) అన్న పేర్లు సరిపోతాయి కాని భారత జాతీయ కాంగ్రెస్ అన్న పేరు పెట్టుకునేందుకు దానికెంత మాత్రమూ అర్హత లేదు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Advertisement
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.